తెలంగాణలో కేజీ టూ పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే బోధన
హైదరాబాద్ : కరోనా ఉధృతి తగ్గని నేపథ్యంలో, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేజీ టూ పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు జులై 1వ తేదీ నుంచి కేజీ టూ పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఇంతకు ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను కూడా జులై నెలలో నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలు రద్దు కావని మంత్రి సబిత స్పష్టం చేశారు.
50 శాతం మంది టీచర్లు హాజరు
టీచర్ల హాజరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టతనిచ్చారు. 50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరు కావాలి. రోజు విడిచి రోజు టీచర్లు విధులకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన జీవో జారీ అవుతుందన్నారు. ప్రయివేటు పాఠశాలలు తప్పనిసరిగా 46 జీవోను అమలు చేయాలి. ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
Comments are closed.